పదోతరగతితో సెంట్రల్లో మంచి కొలువులో స్థిరపడేందుకు ఎస్ఎస్సీ మంచి నోటిఫికేషన్ తో సిద్ధం అవుతోంది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరలో విడుదల చేయనున్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నోటిఫికేషన్ మీ కోసమే. కేవలం పది పాసైతే చాలు పదిలమైన కెరీర్ సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇది. గ్రూప్-సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్ ఉద్యోగానికి ఎంపికయితే ప్రారంభంలోనే మంచి వేతనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ తెలుసుకుందాం..
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: కొన్ని పోస్టులకు 18 నుంచి 25, మరికొన్నిం టికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5. ఓబీసీలకు 3, ఎక్ససర్వీసెమెన్లకు 3, పీడబ్ల్యూడీల కు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్సెసర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాల కోసం www.ssc.nic.in వెబ్ సైట్ లో సంప్రదించాలి.
విధులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, ఉన్నతాధికారుల వద్ద అన్ని రకాల రోజువారీ కార్యకలాపాలు, ఆఫీస్ పనులు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్గా వీరిని ఆఫీస్ అటెండెంట్స్ అని చెప్పవచ్చు. సెక్షన్/యూనిట్ను శుభ్రం చేస్తూ నీట్ గా ఉంచడం. ఫైల్స్, రికార్డులు మెయింటెన్ చేయడం, ఫ్యాక్స్ పంపడం, జిరాక్స్, ప్రింట్స్ తీయడం, డైరీ మెయింటెయిన్, డిస్పాచ్, పోస్టులు పంపడం, సెక్షన్ ను భద్రంగా చూసుకోవడం. వాహనాలు నడపడంతో పాటు పై అధికారులు చెప్పిన అన్ని రకాల విధులు నిర్వర్తించాలి.
సెలెక్షన్ ప్రాసెస్:
రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అనే రెండు పేపర్లుంటాయి. ఆన్లైన్ లో నిర్వహించే ఆబ్జెక్టివ్ పేపర్ లో నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 90 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు మైనస్ అవుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ (ఇంగ్లీష్ కు తప్ప) భాషల్లో ముద్రిస్తారు. పేపర్-1 లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే రెండో దశలో వ్యాసరూప సమాధాన పరీక్ష (డిస్క్రిప్టివ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే, లెటర్ ఇన్ ఇంగ్లీష్ టాపిక్స్ మీద ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 50. సమయం 30 నిమిషాలు. ఇంగ్లీష్, హిందీ లేదా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ఏదైనా ప్రాంతీయ భాషలో సమాధానాలు రాయవచ్చు. అక్షర దోషాలు, పంక్చుయేషన్ మార్క్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పేపర్-1 మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా తయారు చేస్తారు. వివిధ షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే పేపర్-11 లో వచ్చిన మార్కులను చూస్తారు. అందులోనూ సమాన మార్కులుంటే పుట్టిన తేది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పేరు వంటివి చెక్ చేస్తారు.